15, నవంబర్ 2012, గురువారం

మాతృ గీతం రచన: అందెశ్రీ



జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
|| జయ…||
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
|| తర…||
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ
|| జై…||
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడేలే బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్
|| జై…||
జానపదా జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృతపరచే గీతాలా జనజాతర
అనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం
|| జై…||
సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పూవులపొద
సిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద
|| జై…||
గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి

9, మార్చి 2010, మంగళవారం

తొలి తెలంగాణా ఛానల్........



బుల్లి పెట్టెల బోలెడు ఆనందం..
రంగు రంగుల బుల్లి పెట్టె..
ఇన్ని రోజులాయె మీ టీవీ మన టీవీ మనదే మనదే అంటది కని
సంకురాతిరత్తె ఆంధ్ర బస్సులు ఎన్ని పొయినయ్ ఈడనుండని లెక్కలు గట్టె గని,
నా బతుకమ్మని గౌరవించిన పాపాన పోలే యేనాడు..
ఆంధ్ర భోజనం ఎట్ల చేత్తరని పొద్దుకు పది సార్ల వంటలు వార్పులు చెప్పెగని,
నా సకినాలని, సర్వపిండి మొకం సూపిచ్చిన రోజెప్పుడులేదు..
వంకర టింకర సోకు తెలుగుల బాషని వొయ్యారంగ సూపిచ్చె గని..
నా అచ్చతెలుగు తెలంగాణం రౌడీల బాషని చెప్పె..
నలుగురు చేసిన నాలుగు గోడల సమైక్య పోరాటాన్ని ఎత్తేషి, దిగేషి సూపె, కని
రాష్ట్రం నడిబొడ్డున బలిదానాలని పిరికి చర్యలని ఎద్దేవా చేషె..
థూ నీ యమ్మ నేనింక సూడను గాక సూడ మల్ల నీ మొకమని ఇసిరి పారేషిన దానమ్మ …
అరెరె..ఎంత పనాయె… మల్ల ముందుకచ్చె..ముద్దు ముద్దుగ నా బాషల మాట్లాడుకుంట..
ఎంత సొగసు..
ఎంత ముద్దు..
నా పాట, నా మాట, నా బాట..
తెర మీద రంగుల చిత్రంల వేయి వెలుగులు యెలుగుతున్నది..
మనసంత ఒక ఆనందం నిండిపాయె టక్కున..
నీ అమ్మ కడుపు సల్లగుండ గీ టీ వీ పెట్టినవ్ కేసీయారో అనుకున్న..
ఇగ సాలన్న.. గిది సాలు.. నిన్ను సచ్చేదాంక గెలిపిచ్చుకుంటం…
నువ్వన్నా నాయకుడివి…
నువ్వు ఒక్కనివి సాలన్నా .. మా గొంతుకలిననీకి.. నీ గొంతుకని ఇనిపియ్యడానీకి..
సూషిన కొద్దీ సొక్కంగ ఉండె…
ఇన్న కొద్దీ సంగీతమాయె..
కన్న కొద్దీ కలల పండుగలాయె..
నా గోస చెప్పుకుంట..
నా ఇంట్ల నా కోసం నా వోల్ల కోసం..
ఇన సక్కని నా బాషల..
సూడ సక్కని నా సంస్క్రుతి సంప్రదాయాన్ని ఒణికి పుచ్చుకుని..
అన్యాయం నిలదీయగ..
మా సంకెల్లు తెంచగ..
మా గుండె గొంతుక సప్పుడు…
ఒక యాది.. ఒక మనాది…
ఒక లడయ్.. ప్రేమగ అలయ్ బలయ్
అనుకుంట..
మాకు కుడ టీవి అచ్చింది…
అన్నలాలా… టీ వీ తొమ్ముదులూ, అయిదులూ
దండం మీకు..
మీ సేవలు సాలు మాకు..
మీరింక మీ తొవ్వ సూస్కోవచ్చు..
ఇప్పుడు మీరు బాధ పడి యేం లాబం లేదు..
మీ చానల్లు నడవాలంటె ప్రత్యేకంధ్ర
పోరాటం చేస్కుని ఆడ పెట్టుకొండ్రి సంసారం..
జయ హో తెలంగాణ..
జయ హో రాజ్ టీవీ..

జై తెలంగాణ...జై జై తెలంగాణా.............

8, మార్చి 2010, సోమవారం

మహాత్మా నువ్వెప్పుడు పుడుతావు......


లీడర్ కి రాజకీయనాయకుడికి తేడ ఏంటి.............
రాష్ట్రంలో లీడర్ ఎవరు.....??

జనానికి ముందు ఉండి నడిపించేవాడిని లీడర్ అంటారు
జనాలని దోచుకుతినేవాడిని రాజకీయనాయకుడు అంటారు అని తెలుసుకున్నాను.

రాజకీయనాయ'కుల'ను నడిపించేవారిని ఏమంటారో మరి????????




ఒక గంట సేపు టివి ముందు కూర్చుంటే హత్యలు, మాన భంగాలు, ప్రేమ అనే నెపంతో యాసిడ్ దాడులు, పసిపిల్లల్ని కుడా అరాచకంగా హత్యలు చేయడం, రాష్ట్ర బందులు, రాస్తా రోకోలు ఇవే మనం చూసేది ఎక్కువగా. ప్రశాంతం గా బ్రతుకుతున్నాం అని ఎవరైనా గుండెలపై చేయి వేసుకొని చెప్పలేని పరిస్థితుల్లో ఇప్పుడు మనిషి వున్నాడన్నది నగ్న సత్యం. శాంతి భద్రతలు పూర్తి గా అడుగంటిపోయాయి. వీటన్నింటికి కారణం ఎవరు? ఇది వరకు వంద కోట్ల కుంభకోణం అంటే 'అమ్మో!?' అనుకునే వాళ్ళం. ఇప్పుడు లక్షల, కోట్ల కుంభకోణాల గురుంచి విన్నప్పుడు అదొక సాధారణంగా అలవాటైపోయింది. అంటే మనిషి ఎంత పెద్ద దానికైనా అడ్జస్టయిపోతున్నాడు. అది పోవాలి. అరాచకాలు ఆగాలంటే వ్యస్వస్తలో మార్పు రావాలి.

ప్రజల్లో మారుపు రావాలి...అది ఎలా సాధ్యం.....ఎనిమిది కోట్ల మంది ప్రజలను మార్చడం కంటే 294 మంది ప్రజా ప్రతినిధులను మార్చడం కరెక్ట్ కదా?

మరి  వీరిని మార్చే నాయకుడు ఇంకా భూమి మీద పుట్టలేర???
మళ్లీ మహాత్మాగాందీ పుట్టాలి...
ఒకవేళ పుట్టిన బ్రిటిష్ వాళ్ళను తరిమినట్టు మన రాజకీయనాయకులను తరిమికోట్టలేరేమో

సామాన్యుడి గోడు.....రోశయ్య పాలనకు వినపడదా




మాది ఉమ్మడి కుటుంబం, మాకు తెల్ల రేషన్ కార్డు ఉంది. నెలకు రేషన్‌ ద్వారా 20 కిలోల బియ్యం వస్తున్నాయి. కిలో చెక్కర, 8 లీటర్ల కిరోసిన్‌ ఇస్తున్నారు. వీటిని బయట కొంటే మేము రోజూ కష్టపడి పని చేసిన డబ్బంతా వాటికే పెట్టాల్సివస్తుంది. అన్ని సరుకుల ధరలూ పెరిగాయి. రేషన్‌ దుకాణం ద్వారా ఇచ్చే చక్కెర, కిరోసిన్‌ తగ్గిస్తే ఎట్ల బతకాలి? 8 లీటర్ల కిరోసిన్‌ ఒక నెలంత ఎలా సరిపోతది. బ్లాకు లో లీటరుకు 30 రూపాయలు పెట్టి మరో పది లీటర్లు కొనుక్కుంటే గాని నెల గడవడం లేదు....ఇంతకూ ముందులా తెల్ల రేషన్ కార్డు వాళ్ళందరికీ 20 లీటర్ల కిరోసిన్ ఇస్తేనే మాలాంటి సామాన్యుడు కొంచమైన ఆనందంగా బ్రతకగలరు.

సంక్షేమం పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్‌ పథకంలో చేరిన బోగస్‌ కార్డులు ఖజానాను గుల్ల చేస్తున్నాయి. బోగస్‌ భారం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కు అన్నట్లు గా మారాయి. ఈ నెలలోగా పూర్తి కావాల్సిన బోగస్‌ కా ర్డుల ఏరివేత కార్యక్రమం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో పూర్తయితే గొప్పేనని అధికారవర్గాలు చెబుతు న్నాయి.

దశల వారీగా ఐదు దశలలో పూర్తిచేయాల్సిన సర్వే పనులు ఇంకా పలు జిల్లాల్లో ప్రాథమిక దశలోనే కునికి పాట్లుపడుతున్నాయి. కార్డుల ఏరివేతలో జరుగు తున్న జాప్యం ప్రభుత్వ ఖజానాకు పెద్ద గుదిబండగా మారి ఆర్ధిక పరిస్థితిని మరింత కుంగదీస్తోందని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. బోగస్‌ కార్డులకు సంబంధించి ప్రభుత్వ వర్గాలు చేస్తున్న సర్వే అంచనాలు కూడా కాకి లెక్కలను తలపిస్తున్నాయి. మొదటి దశలో చేసిన సర్వేలో బోగస్‌ రేషన్‌కార్డులు 10 నుంచి 15 శాతం ఉన్నట్లు వెల్లడిం చారు. ఇక దానినే ప్రామాణికంగా తీసుకుని కాస్త అటూ ఇటుగా అదే స్థాయిలో బోగస్‌ కార్డులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనినిబట్టి మొత్తం ఐదు దశలలో సుమారు యాభై లక్షల వరకు బోగస్‌ కార్డులు న్నట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. అయితే సర్వే పనులు ఎంచుకున్న ప్రమాణాల మేరకు జరుగు తున్నాయా అన్న అంశంపై సందేహాలు వ్యక్తమవు తున్నా యి.

రాష్ట్రంలో అరకోటి కుటుంబాలలో ఉన్న బోగస్‌ కార్డు లను రద్దు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం అసలు కార్డులకు ఎక్కడ ఎసరు తెస్తుందోనన్న అనుమానాలు, ఆందోళనలు సామాన్య ప్రజలలో వ్యక్తమవుతున్నాయి. ఏరివేత పూర్తయితేనే కొత్త కార్డులు ఇస్తామని, అదనపు బియ్యం కోటా ఇస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు గత నెలలో ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే మంత్రి ప్రకటన ఇప్పట్లో అమలుకు నోచుకునే పరిస్థితి కూడా కనిపించడంలేదు. బోగస్‌ కార్డుల ఏరివేత సర్వే పనులకు కరవు, వరదల వంటి ప్రకృతిపరమైన విపత్తులు ఆటంకంగా మారాయంటూ అధికారులు ఎప్ప టికప్పుడు ఏరివేత లక్ష్యాలను పొడిగించుకుం టున్నారు.

ఆరోగ్య శ్రీ కోసమే బోగస్‌లు...
పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం వారికన్నా బోగస్‌ కార్డుల రూపంలో ప్రభుత్వ ఖజానాను గుల్ల చేస్తోంది. రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ప్రభుత్వం 2007 జూన్‌ మాసంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీని ద్వారా ఇప్పటి వరకు 3 లక్షల 6 వేల 380 మంది శస్త్ర చికిత్సలు పొందారు. ఆరోగ్య శ్రీ ట్రస్టు లెక్కల ప్రకారం ఈ చికిత్సలకు ఇప్పటి వరకు 985 కోట్ల రూపాయలు ఖర్చయింది. అయితే ఈ పథకం కేవలం తెల్లరేషనుకార్డు ఉన్న వారికే కావడంతో రాష్ట్రంలో బోగస్‌ కార్డులకు తెరలే చిందని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఆరోగ్య శ్రీ పథకంలో లబ్ది పొందేందుకు అర్హుల తోపాటు అత్యధిక సంఖ్యలో అనర్హులు సైతం తెల్లకార్డులు పొందారని పౌర సరఫరా అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎన్నికలు జరగక ముందు వరకు తెల్లరేషను కార్డులు, అంత్యోదయ అన్నయోజన, అన్న పూర్ణ పథకాల కార్డులు కలిపి 1.88 లక్షల వరకు తెల్లకా ర్డులున్నాయి. ఆ తర్వాత వాటి సంఖ్య 2.27 కోట్లకు చేరిం ది.. ఇంకా 20 లక్షల వరకు కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటిలో దాదాపు 30 లక్షల కార్డులు బోగస్‌విగా ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. సర్వే మొదలయ్యాక బోగస్‌ల సంఖ్య 50 లక్షల దాకా ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. బోగస్‌ కార్డులలో అత్యధికంగా ఆరోగ్య శ్రీ పథకంలో లబ్ధి పొందడం కోసం తీసుకున్నవే ఉన్నట్లు సర్వేవర్గాలు పేర్కొంటున్నాయి.

3, మార్చి 2010, బుధవారం

రండి రండి........




జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ కేవలం సంప్రదింపులకు మాత్రమే అని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ప్రజలు, వివిధ వర్గాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఈ కమిటీ సేకరిస్తుంది. అయితే, ఈ కమిటీలో వివిధ రంగాలకు చెందిన నిపుణులకు స్థానం కల్పించినట్టు ఆయన తెలిపారు. కాగా, ఈ కమిటీలో చోటు కల్పించిన ఐదుగురు సభ్యుల్లో ఒక్కొక్కరు ఒక్కో రంగానికి చెందిన వారు కావడం గమనార్హం.

కమిటీ ఛైర్మన్‌గా జస్టీస్ శ్రీకృష్ణ సుప్రంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పని చేశారు. ఇక కమిటీలోని మిగిలిన సభ్యులల్లో వీకేదుగ్గల్ ఒకరు. ఈయన కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి. రవీందర్ కౌర్.. న్యూఢిల్లీలోని ఐఐటీ సామాజిక శాస్త్రవేత్త.

రణబీర్ సింగ్.. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇకపోతే.. అబూసలేం షరీఫ్.. ప్రపంచ ఆహార ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ రీసెర్చ్‌గా పని చేస్తున్నారు. ఈ కమీటీలో ముగ్గురు ప్రొఫెసర్లు, న్యాయ, ఆర్థిక నిపుణులు కావడం గమనార్హం.

మా తెలంగాణా మాకు ఇస్తారని కోరుకుంటూ.....
తెలంగాణా ముద్దుబిడ్డ

జై తెలంగాణ.....జై జై తెలంగాణా

27, ఫిబ్రవరి 2010, శనివారం

తుపాకి తూట్లు.......

ఆంద్ర  నాయకుల కోట్లు
తెలంగాణా ప్రజలకు పోట్లు
అడ్డుక్కోడానికి వస్తారు ఓట్లు
అప్పుడు చుప్పిద్దాం మన పాట్లు
మన రాష్ట్ర సాధనకై ఉద్యమం చేస్తే........
పేలుస్తున్నారు తుపాకి తూట్లు

జై తెలంగాణా.......జై జై తెలంగాణా.........

26, ఫిబ్రవరి 2010, శుక్రవారం


Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger