13, జనవరి 2010, బుధవారం

సిరిగల్ల తెలంగాణా చరిత్ర.....





ఇది తెలంగాణ. మారు పేరు గాయాలవీణ. దీని గతం పోరాటచరిత్ర. వర్తమానంలో నా ఆశను, ఆశయాలను భుజానికి తగిలేసుకొని సాగిపోతున్న బిడ్డలను కన్న తల్లి. నాడు నైజామోడికి వ్యతిరేకంగా పోరాడింది. అరవై తొమ్మిదిలో ఆంధ్ర దోపిడికి వ్యతిరేకంగా కొట్లాడింది. డెబ్బైలో దొరోడికి వ్యతిరేకంగా దండు కట్టింది. ఇంకా దండు సాగుతున్నది. ఇన్నేండ్లు నడిచి… నడిచి… కొట్లాడి…. కాళ్ళకు కలుకులొచ్చినవి. అయినా ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు ఉద్యమిస్తూనే ఉంది.

తెలంగాణ గురించి తెలుసుకోవటమంటే నిప్పుల చరిత్రను తేలుసుకోవటమే. దీని బాట పూల బాటకాదు. ముళ్ళ బాట. ఆ ముళ్లను ఏరేసుకుంటూ నడిచినా నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. నిజాం పిశాచి నిప్పుల్లో నడిపించాడు. అట్లా నడుస్తూనే సాయుధమయ్యింది. శత్రువును పరిగెత్తించింది. తన బిడ్డలకు పూల బాట వస్తుందని ఆశపడ్డది. మోసం చేశారు. సీటు కోసం దగా చేసారు. నమ్మినవాళ్లే నట్టేట ముంచారు. వాళ్లే ఇవ్వాళ విశాలాంధ్ర పేరిట విశాల దోపిడీలో భాగమవుతున్నారు. భాష పేరిట, సంస్కృతి పేరిట ఒకటవుదామని ఢిల్లీలో పంత్ నాయకత్వంలో ‘పెద్దమనుషుల ఒప్పందం‘ ద్వారా కుట్ర చేశారు. న్యాయం చేస్తామన్నారు. అన్నదమ్ముళ్లా ఉందామన్నారు. అందరం ఒకటేనన్నారు. అన్యాయం చేశారు. పదేండ్లపైగానే చూసింది. కొలువులు లేవు. సీట్లు లేవు. చదువులు లేవు. అన్నీ తన్నుకుపోయారు. చదువురాదని ఎక్కిరించారు. భాష రాదని హేళన చేశారు. ఎన్నాళ్లని ఓర్చుకొనేది. ఎదురుతిరిగి కొట్లాడడం తెలంగాణకు కొత్తకాదు. “వాని తాతకు తాత నైజామోడు నాకెదురెవ్వని నాట్యమాడితే వీర తెలంగాణ చుట్టుముట్టితే పైజామూడి పరుగు తీసిండు” (జననాట్యమండలి పాటలు - పుట.40)

1707 లో ఔరంగజేబు మరణం తరువాత మొగల్ సామ్రాజ్య సుబేదార్‌గా ఉన్న నిజాం 1724లో స్వతంత్ర్యం ప్రకటించుకున్నాడు. ఇట్లా పురుడోసుకున్న నిజాం నిరంకుశ పాలన 1948 వరకు కొనసాగింది. ఈ కాలంలో తెలంగాణ ప్రజలు బానిస సమాజపు ఆనవాళ్లను చవిచూశారు. స్త్రీలను నగ్నంగా బతుకమ్మను ఆడించిన విసునూర్ దొరలకు అధికారం ఇచ్చినవాడు నిజాం. చెమటను నీరు చేసి పండించిన పంటను దోపిడి చేసిన జాగీర్దార్లకు అండగా నిలచింది నిజామే. ఉర్దూ అధికార భాష పేరిట తెలుగుభాషకు జీవం లేకుండా చేశాడు. మతోన్మాదంతో మత మార్పిడులను ప్రోత్సహించాడు. ఎదురు తిరిగిన వాళ్లను బూడిద చేశాడు.







ఉద్యమాల నేపధ్యం

మట్టిని ముట్టుకుంటే ఉద్యమాలు పూసే నేల ఇది. మట్టిమనుషుల ఆగ్రహం ఉద్యమాలుగా రూపొందింది. వ్యక్తులుగా శక్తులుగా ఈ ప్రాంతంలో అనేక ఉధ్యమాలు వచ్చాయి. “ఉద్యమం అనే మాటకు పైకెత్తుట, శ్రమము, ప్రయత్నము, సిద్ధమగుట, గట్టిపూనికతో చేసే ప్రయత్నము” (సూర్యారాయాంధ్ర నిఘంటువు, పుట.637) అని డిక్షనరీ అర్ధాలు ఉన్నాయి. అయితే ఆధునిక కాలంలో ఉధ్యమాన్ని విశాల అర్ధంలో వాడుతున్నాం. ఆంగ్లంలో ‘మూవ్మెంట్’ అనే పదానికి సమాన అర్ధం ‘ఉద్యమం’ అని వాడుతున్నాం. “ఒక లక్ష్యాన్ని సాధించడంకోసం జరిగే వ్యవస్థీకృత ప్రయత్నం” (చాంబర్స్ మినీ డిక్ష్నరీ, పేజి.324) ఉద్యమంగా చెప్పవచ్చు. మానవ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ మార్పులన్నీ వాటంతటావే జరిగినవి కావు. వీటికొక గతితార్కిక నియమం ఉంటుంది. ప్రజలు ఒకవైపు ప్రకృతిపై పోరాడుతూ విజయం సాధిస్తూ ఉంటారు. మరోవైపు తోటి మనిషిపై కూడా పోరాటం మొదలు పెడతారు. ఈ పోరాటమే ఒక సమిష్టి రూపం తీసుకుంటుంది. దీనినే మనం ఉద్యమం అనొచ్చు. ఈ ఉద్యమం సమాజంలో మౌలిక మార్పుకు దారితీస్తుంది. ఏ మార్పు అయినా ప్రజల ప్రయత్నం వలన వస్తుంది తప్ప అప్రయత్నంగా ఊడిపడదు.

“వేళ్లూనుకొని ఉన్న పాత సంబంధాలు, పాత పద్ధతులు ఇక ఏ మాత్రం కొనసాగడానికి వీల్లేని పరిస్థితులాసన్నమయి, పాత వాటి మీద క్రమంగా అసంతృప్తి ప్రారంభమై, ఆ అసంతృప్తి రాను రాను పెరిగి పెద్దదవుతుంది. తద్వారా పాత-కొత్త సంబంధాల మధ్య సంఘర్షణ ఉద్యమాలకు దారితీస్తుంది” (తెలుగులో ఉద్యమం గీతాలు పుట 4)

మార్పు లేకుండా మానవ సమాజం లేదు. ఆ మార్పు కచ్చితంగా ముందడుగే. మనుగడ కోసం మనిషి పోరాడుతాడనే డార్విన్ సిద్ధాంతం మానవ పురోగతికి అద్దం పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా “పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టిందని” మార్క్స్ చెప్పిన మాట శాస్త్రీయ సత్యం. ప్రపంచంలో వలస వాదాన్ని తరిమికొట్టి స్వేచ్చాగానాలు పీల్చుకున్న పోరాటం అమెరికన్ విప్లవం. భూస్వామ్య విధానాన్ని కూలదోసి పెట్టుబడిదారి విధానానికి పునాదులు వేసింది ఫ్రెంచ్ విప్లవం. రష్యాలో భూస్వామ్య, పెట్టుబడిదారి విధానాలను అంతం చేసి సామ్యవాదాన్ని నెలకొల్పింది సోషలిస్టు విప్లవం. ఇలా అనేక చోట్ల అనేక విప్లవాలు, ఉద్యమాలు పాత సామాజిక వ్యవస్థ పునాదులను కదిలించి కొత్త వ్యవస్థను నిర్మించాయి.

భారత దేశంలో కూడా అనేక ఉద్యమాలు వచ్చాయి. సంఘ సంస్కరణ, జాతీయోద్యమాల కాలంలోనే ఒకవైపు బ్రిటీష్ వారిపై పోరాడుతూనే అంతర్గత అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయి. ఈ ప్రభావంతో తెలుగు నేలలో కూడా ఎన్నో ఉద్యమాలు జీవం పోసుకున్నాయి. దేశవ్యాపితంగా విస్తరించిన జాతీయోద్యమ భావాలు తెలుగు సాహిత్యంపై విశేష ప్రభావాన్ని చూపాయి.

ఇక బ్రిటీష్ పాలన ప్రభావం ఏమాత్రం లేని తెలంగాణలో భూస్వామ్య, జమీందారీ, జాగీర్దార్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రారంభంలో జానపద హీరోల నాయకత్వంలో మొదలయ్యాయి. నల్గొండ జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, పాలమూర్లో మీరాసాబ్, పండుగోల్ల సాయన్న లాంటి వ్యక్తులు కొద్ది సమూహాన్ని కూడగట్టుకొని స్థానిక దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారు. అయితే ఇవి వ్యవస్థలో సమూల మార్పును తీసుకరావడానికి నడిచిన ఉద్యమాలు కావు. స్థానిక నిరసనలు మాత్రమే. ఈ నాయకులను ఆనాటి పాలకులు దుర్మార్గంగా చంపేశారు. వీరిపై ప్రజలు వివిధ జానపద రూపాలలో కథలల్లుకున్నారు. పాటలు పాడుకున్నారు. తమ గుండెల్లో ప్రేమగా నిలుపుకున్నారు. కలుపుల్లో, కోతల్లో, కోలాటంలో ప్రత్యక్షం చేసుకొన్నారు.

తెలంగాణలో నిజాం పాలనకు వ్యతిరేకంగా సమిష్టి ఉద్యమ రూపాలు 1930లలో మొదలయ్యాయి. మొదటి నిర్మాణ రూపం అంధ్ర మహసభ. తెలుగు భాష మాట్లాడటానికి, రాయటానికి, చదవటానికి వీలులేని రోజులివి. జన్మనిచ్చిన భాష కోసం పోరాటం మొదలయ్యింది. అది రాను రాను ఆర్ధిక, సామాజిక, రాజకీయ ఆకాంక్షలతో పరిపక్వమైంది. అన్నిరకాలుగా బలవంతుడైన నైజామును ఎదుర్కోవటానికి ఆంధ్ర మహాసభ 1946లో సాయుధ పోరాటానికి సిద్దమైంది. ఈ ఉద్యమం 1953 వరకు అనేక తర్జనభర్జనల మధ్య కొనసాగి అదే సంవత్సరంలో ఆగిపోయింది. ఈ సంవత్సరంలోనే తెలంగాణ విద్య ఉద్యోగ రంగాలలో స్థిరపడిన హిందీ రాష్ట్రాల ప్రజలకు వ్యతిరేకంగా ఇక్కడి యువత ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ అంటూ ఉద్యమాన్ని లేవదీశారు. ఈ సందర్భంలో జరిగిన కాల్పుల్లో 8 మంది విద్యార్ధులు మరణించారు. 1956లో నిరసనలు, విన్నపాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడి విద్యా, ఉద్యోగ రంగాలలో కోస్తాంధ్ర వాళ్లు నిండిపోయారనే కారణంతో 1969లో విద్యార్ధి, నిరుద్యోగులు 9 నెలలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు.

ప్రపంచ వ్యాప్తంగా 60వ దశకం గర్జించు అరవైలుగా నమోదైంది. చైనా సాంస్కృతిక విప్లవ ప్రభావం ప్రపంచంపై పడింది. సమాజంలో మౌలిక మార్పు కోసం ఉద్యమాలు-పోరాటాలు జీవం పోసుకున్నాయి. పరిమిత ఆకాంక్షల కోసం వచ్చిన 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నక్సల్బరి, శ్రీకాకుళ పోరాటాల ప్రభావంతో విప్లవోద్యమంగా రూపంతరం చెందింది. తరువాత దేశమంతా విస్తరించింది. 80వ దశకంలో అంధ్ర ప్రాంతంలో ప్రారంభమైన దళిత ఉద్యమం తెలంగాణలో స్థిరత్వాన్ని సంపాదించింది. సిద్ధాంత భావజాలాన్ని పెంచుకుంది. 1969లో ఆగిపోయిన తెలంగాణ ప్రజల ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష 90వ దశకంలో ఎజెండా మీదికి వచ్చి ఉద్యమ రూపాన్ని సంతరించికుంది. ఇది స్థూలంగా తెలంగాణలో ఉద్యమాల నేపధ్యం.

‘సమాజంలో సాహిత్యం, కళలు ఉపరితల అంశాలు. అయితే వీటికి పునాది అంశాలను ప్రభావితం చేసే లక్షణం కూడా ఉంది. ఎక్కువ మేరకు పునాది అంశాల చేత ప్రభావితమవుతూ సమాజంపై ప్రభావమేస్తాయి’. (ప్రజాసాహిత్యం-జయధీర్ తిరుమలరావు-పుట.1) సమాజంలో వస్తున్న మార్పులకు స్పందనగానే సాహిత్యం వస్తుంది. ఈ సాహిత్యం మౌఖిక రూపంలో ఉంటుంది. లిఖిత రూపంలో ఉంటుంది. శ్రమజీవుల భౌతిక సామాజిక జీవితం పునాది కాగా సాహిత్యం, కళలు ఉపరితలంలో ఉంటాయి. పనిచేస్తున్నప్పుడు, శ్రమనే వస్తువుగా చేసుకొని జీవితాన్నే పాడుకుంటారు. ఈ పాటలు వీరి పనిలో భాగంగా నోళ్ల నుంచి సహజంగా వెలువడుతాయి. ఇట్లా పుట్టే సాహిత్యమే మౌఖిక సాహిత్యం అవుతుంది. ఈ మౌఖిక సాహిత్యమే లిఖిత సాహిత్యానికి మూలమవుతుంది. ఈ సాహిత్యంలో ఉండే వస్తువు, రూపం, శిల్పం గొప్పగా కనిపిస్తాయి. ఈ సాహిత్యం నిండా గొప్ప జీవిత చిత్రణ ఉంటుంది

5 కామెంట్‌లు:

  1. oka vishayam. andaroo Andhra, Telangana antunnaru..
    Charitra prakaaram.. Telugu mariyu Andhra anevi paryaya padaaluga vaadaru.. Idi nenu ekkado chadivaanu. Mariyu idi tarkamuga kooda anipinchindi.
    meeru andhra ga raasina pradesam, costal andhra ani undedi.... ippudu MEDIA valla daanni Andhra antunnaru...
    Udyamam anedi ekkadaina untayi... Rani Rudrama Devi kaalamlo Telangana yememi udyamaalu chesindandi..
    ee udyamaalu modata telangana loni dorala meeda cheyyandi.. prastutam, mariyu 1969 lo chesinavi antha dorale chesina udyamaalu..
    Gaddar elaa maatladina, monna oka manchi vyakhya chesaaru. Manaki kaavalsindi "Dorala Telangana kaadu, Prajala Telangana" ani.. modata akkadi prajaa prathinidhulani niladeeyandi.. ade pedda udyamam

    రిప్లయితొలగించండి
  2. సార్ ప్రపంచం అంతా ఇప్పుడు యెటు పోతుందో చూడండి కష్టపదే వాళ్ళుముందుకు పోతున్నారు ప్రపంచమంతా ఒక కుగ్రామం అయిపోయింది..ఇప్పుడు కావలసింది పోరాటాలు కాదు,hard work&dedication..యెంత శ్రమపడితే అంత యెదుగుతామ్..ఈ రాజకీయమాయకులు చెప్పింది విని చెరిత్రలు లెక్కట్టుకు కూర్చుంటే వెనకబాటుతనం తప్పదు ..

    రిప్లయితొలగించండి


Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger